బీస్ట్ మోడ్ అంటారు అదే. కొహ్లీ మెల్లగా ఆ బీస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతున్నాడు ఈ ఐపీఎల్ లో. ఈ సీజన్ ను ప్రారంభించటమే హాఫ్ సెంచరీతో ప్రారంభించినా ఎందుకో స్టార్టింగ్ లో ఆ ఊపు కనిపించలేదు. హాఫ్ సెంచరీ కొట్టడం కోసం ఎక్కువ బాల్స్ ఆడుతున్నాడు అనే విమర్శలు మొదలుపెట్టారు యాంటీ ఫ్యాన్స్. కానీ ఆర్సీబీ పాయింట్లు సాధించటం మొదలుపెట్టిన కొద్దీ కొహ్లీ కూడా బీస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతున్నాడు. నిన్న రాజస్థాన్ మీదైతే పూనకాలు వచ్చినట్లు ఆడాడు. ఏమన్నా షాట్స్ అవి. ప్రత్యేకించి ఫ్లిక్ షాట్ తో సిక్సర్ కొట్టిన తీరు ఉంది మాస్టారు సూపర్ అంటే అంతే. ప్యూర్ క్లాస్. మొత్తంగా 42 బాల్స్ ఆడి 8ఫోర్లు 2 సిక్సులతో 70పరుగులు చేశాడు కింగ్ కొహ్లీ నిన్న. పడిక్కల్ తో కలిసి స్కోరు బోర్డున పరుగులు పెట్టించిన విరాట్ కొహ్లీ రాజస్థాన్ కు 206పరుగుల భారీ టార్గెట్ ఇచ్చేలా చేశాడు. చిన్నస్వామిలో గెలవాలంటే కచ్చితంగా పెద్దస్కోరు కొట్టాలి. నిన్న కానీ ఆర్సీబీ 200 కొట్టకపోయి ఉంటే మ్యాచ్ పక్కాగా రాజస్థాన్ తన్నుకుపోయేది. అందుకే కొహ్లీ దూకుడుగా ఆడాడు నిన్న. మొత్తంగా తొమ్మిది మ్యాచ్ లు ఆడిన కొహ్లీ ఈ సీజన్ లో నిన్న వరుసగా రెండో హాఫ్ సెంచరీ కొట్టి మొత్తంగా ఐదు అర్ధశతకాలు పూర్తి చేసుకున్నాడు. సీజన్ మొదట్లో అంతా సాయి సుదర్శన్, పూరన్, కేఎల్ రాహుల్ అని మాట్లాడుకుంటే ఎప్పుడు వచ్చాడో కూడా తెలియకుండా హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు కొడుతూ ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ రేస్ లో సెకండ్ ప్లేస్ లో నిలబడ్డాడు కొహ్లీ.